అల్పాహార పథకానికి కేంద్రీకృత వంటశాల ఏర్పాటుపై కసరత్తు

Facebook
X
LinkedIn

మేడ్చల్ :

ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం అమలుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో ఎంపికైన 22 పాఠశాలలకు అల్పాహారం సరఫరా చేసే కేంద్రీకృత వంటశాల నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ మను చౌదరి మంగళవారం ఆలియాబాద్, కేశవరం గ్రామాల్లోని మూసివేసిన బీసీ ప్రీ-మెట్రిక్ హాస్టళ్లను పరిశీలించారు.

జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు అల్పాహారం అందించే విధంగా సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందుకు అనువైన స్థలాల ఎంపికలో భాగంగా శామీర్‌పేట్, మూడుచింతలపల్లి మండలాల్లోని ఖాళీ హాస్టళ్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. హాస్టళ్ల విస్తీర్ణం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. స్థలాలకు సంబంధించిన సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు.

తదనంతరం కేశవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల హాజరు, కొత్త అడ్మిషన్ల వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. క్రీడా సామగ్రి అవసరమని విద్యార్థులు కోరగా, ఫుట్‌బాల్‌లు, క్రికెట్ కిట్లు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం అల్పాహార పథక నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్న మన్న ట్రస్ట్ ప్రతినిధులతో సమావేశమైన కలెక్టర్, కార్యక్రమ అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు.

ఈ పర్యటనలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఝాన్సీరాణి, ఎంఆర్ఓలు శ్రీనివాస్, మహమ్మద్ ఇద్రీస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.