శ్రీశ్రీ సాహిత్యం తరతరాలకు మార్గదర్శి

Facebook
X
LinkedIn

ఈసీ నగర్‌లో మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సంస్మరణ సభ

హైదరాబాద్ :

మహాకవి శ్రీశ్రీ రచనలు నేటికీ సమాజానికి స్ఫూర్తినిస్తున్నాయని ఈసీ నగర్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎం. జగ్గరాజు అన్నారు. మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఈసీ నగర్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఈసీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి గుమ్మడి హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జగ్గరాజు మాట్లాడుతూ, శ్రీశ్రీ తెలుగు సాహిత్యానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన రచనలు సామాజిక చైతన్యానికి, అభ్యుదయ భావాలకు ప్రతీకగా నిలిచాయని అన్నారు.

శ్రీశ్రీ సాహిత్య ప్రస్థానం, ఆయన కవిత్వంలోని సామాజిక స్పృహ, విప్లవాత్మక ఆలోచనలను సభలో వక్తలు స్మరించుకున్నారు. సమాజంలో మార్పు కోసం ఆయన కలం చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు.

అనంతరం మహాకవి శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ కార్యదర్శి గోపాలకృష్ణ, ఈసీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి బాల్‌రెడ్డి, ఏ.బి.చారి, బి.వి.రాజు, విష్ణు, సాహిత్యాభిమానులు, సీనియర్ సిటిజన్లు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.