ఈతను పాఠ్యాంశంలో చేర్చేందుకు మంత్రి హామీ

Facebook
X
LinkedIn

క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన కోల రవీందర్ ముదిరాజ్

హైదరాబాద్, :

ఈతను పాఠ్యాంశంలో చేర్చాలని గత 25 ఏళ్లుగా చేస్తున్న తన పోరాటానికి సానుకూల స్పందన లభించిందని సామాజిక, పర్యావరణవేత్త కోల రవీందర్ ముదిరాజ్ తెలిపారు. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి ఈత విద్య ప్రాధాన్యంపై వివరించిన సందర్భంగా ఆయనకు కర్రతో రూపొందించిన చేప బొమ్మను అందజేసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ఈతను పాఠ్యాంశంలో చేర్చే అంశాన్ని క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావించి ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అలాగే సంబంధిత క్రీడా, విద్యాశాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఇటీవల తమ నియోజకవర్గంలో నలుగురు చిన్నారులు ఈత రాక ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించిన మంత్రి, విద్యార్థులకు ఈతపై అవగాహన కల్పించడం అవసరమని పేర్కొన్నారు. ఈత విద్య కోసం కోల రవీందర్ ముదిరాజ్ చేస్తున్న కృషిని అభినందిస్తూ, ఆయన సేకరిస్తున్న సమాచారాన్ని పరిశీలించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత సమాచారం అందించాలని కోరారు.

కార్యక్రమంలో బాచుపల్లి మాజీ కార్పొరేటర్, మాజీ సర్పంచ్ ఆగం పాండు, రాబోలు జితేందర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.