ఉప్పల్‌లో రూ.6.39 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Facebook
X
LinkedIn

నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం

కాప్రా, :

ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్ ఈసీ నగర్‌లో రూ.6.39 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంతర్గత రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఉప్పల్ ప్రాంతం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఈ నిధులతో కాప్రా, చర్లపల్లి డివిజన్ల పరిధిలోని జమ్మిగడ్డ, ద్వారకాపురి, సిల్వర్ ఓక్, ఈసీ నగర్, రైల్ విహార్, మోడీ అపార్ట్‌మెంట్స్, బీఎన్‌రెడ్డి నగర్ తదితర కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంతర్గత రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పనులు పూర్తయితే స్థానికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

శంకుస్థాపన అనంతరం స్థానికులతో మంత్రి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, పజ్జారి పావని మణిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ప్రభుదాస్ గౌడ్, ఈసీ నగర్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు శ్రావణ్ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.