కుషాయిగూడ మార్కెట్‌లో అక్రమాలపై ఫిర్యాదు

Facebook
X
LinkedIn

షాపుల బదిలీలు, రైతుల నుంచి వసూళ్లపై విజిలెన్స్ దర్యాప్తు కోరిన వెల్ఫేర్ అసోసియేషన్

కుషాయిగూడ :

కుషాయిగూడ కూరగాయల మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరుతూ కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసింది. మార్కెట్‌లో నిబంధనలకు విరుద్ధంగా షాపుల బదిలీలు, ఒకే వ్యక్తుల ఆధీనంలో బహుళ దుకాణాలు, రైతుల వద్ద అక్రమ వసూళ్లు, ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొంది.

అసోసియేషన్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్‌లో మొత్తం 219 షాపులు ఉండగా, కూరగాయల వ్యాపారానికి కేటాయించిన 149 షాపుల్లో అత్యధికం అసలు లబ్ధిదారుల చేతిలో లేవని ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు పలు దుకాణాలను కొనుగోలు చేసి అద్దెకు ఇస్తున్నారని, ఒక్కో షాపు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చేతులు మారుతోందని తెలిపారు.

మార్కెట్‌లో కూరగాయల వ్యాపారానికి బదులుగా రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ఇతర ప్రైవేట్ కార్యాలయాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజూ కూరగాయలు విక్రయించేందుకు వచ్చే రైతుల నుంచి రూ.10 నుంచి రూ.20 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని, ఈ వ్యవహారంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మార్కెట్‌కు సంబంధించి సుమారు రూ.8 కోట్ల అద్దె బకాయిలు, రూ.2 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం ఉందని, దీనివల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఈ అంశాలపై కూడా ప్రత్యేక విచారణ నిర్వహించాలని కోరారు.

అక్రమంగా బదిలీ అయిన షాపుల కేటాయింపులను రద్దు చేయడంతో పాటు, ఒకే వ్యక్తి పేరుపై ఉన్న బహుళ షాపులను స్వాధీనం చేసుకోవాలని, ఖాళీ అయ్యే షాపులను స్థానిక నిరుద్యోగ యువతకు పారదర్శకంగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్‌లోని అన్ని అక్రమాలపై విజిలెన్స్ విభాగంతో సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పనగట్ల చక్రపాణి గౌడ్, చల్లా ప్రభాకర్, కొడకండ్ల యాదయ్య, వెంకటేశ్వర్లు, పండాల గణేష్ గౌడ్, దయానంద్, పిట్టల రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.