వెంటనే కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి: డీవైఎఫ్‌ఐ
చర్లపల్లి, :
చర్లపల్లి పరిధిలోని నేతాజీ నగర్ కాలనీ నుంచి అంబేద్కర్ నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై విద్యుత్ ప్రధాన (లైవ్) వైర్లు ప్రమాదకర స్థితిలో వేలాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్‌ఐ) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ వైర్లు కేవలం ఎనిమిది అడుగుల ఎత్తులో ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. ప్రతిరోజూ స్కూల్ బస్సులు, ప్రజా రవాణా వాహనాలు, భారీ వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా, తక్కువ ఎత్తులో ఉన్న వైర్లు వాహనాలను తాకే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. అదే మార్గంలో వేలాది మంది విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, స్థానిక ప్రజలు నడిచి వెళ్తుండటంతో ప్రమాద భయం మరింత పెరిగిందన్నారు.
ఈ సమస్యను స్థానికులు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపించారు. తెగిపోయిన వైర్లకు తాత్కాలికంగా జాయింట్లు వేసి, వాటిని ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో కప్పి వదిలేయడం ద్వారా అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి తాత్కాలిక మరమ్మతులు ఎలాంటి భద్రతను కల్పించవని, ఎప్పుడైనా భారీ ప్రమాదానికి దారితీయవచ్చని హెచ్చరించారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ప్రాణనష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటూ, ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రమాదకర స్థితిలో ఉన్న పాత, దెబ్బతిన్న విద్యుత్ వైర్లను తొలగించి, నూతన విద్యుత్ లైన్లను నిబంధనలకు అనుగుణంగా సరైన ఎత్తులో ఏర్పాటు చేయాలని కోరారు. ఇకపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డీవైఎఫ్‌ఐ నాయకులు శశాంక్, కిరణ్, ప్రవీణ్, శివ డిమాండ్ చేశారు.
ప్రజల ప్రాణాలకు మించినది ఏదీ లేదని, ప్రమాదం సంభవించే వరకు వేచి చూడకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.