ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

Facebook
X
LinkedIn

పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత తీసుకోవాలి

పరిస్థితులు మారాయి..ఇప్పుడు సంతానం భారం కాదు..సంపద!

చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమంలో తల్లిదండ్రులతో సీఎం చంద్రబాబు

అమరావతి, :

జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో పిల్లలకు పోలియో చుక్కలువేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకుని కొంతసేపు ఆడించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాల లోపు ఉన్న సుమారు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి: సీఎం

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లల తల్లిదండ్రులుతో సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. పిల్లల పెంపకం భారంగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగానికి, ఉపాధికి వెళుతున్న మహిళలు పిల్లల పెంపకంలో ఎలా సమన్వయం చేసుకుంటున్నారని అడిగారు. ఇంట్లో భర్త, మగవాళ్లు కూడా పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం అన్నారు. పిల్లల్ని కని, పెంచడం, వారి అలనాపాలనా చూసుకోవడం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదని అన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉంటే పిల్లల పెంపకంలో భాగస్వాములు అయ్యేవారని అన్నారు. పిల్లలను విలువలతో పెంచడంలో నాడు అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించేవారని గుర్తుచేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైనదని…..అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. సంతానాన్ని సమస్యగా, భారంగా చూసే విధానం పోవాలని…సంతానం అంటే సంపద అనే పరిస్థితి వస్తోందని సీఎం అన్నారు. అందుకే ఇద్దరు అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహిస్తున్నామని సీఎం అన్నారు. ఈ విషయంలో ముందుగా తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.