పారదర్శక ఓటర్ల జాబితాయే ప్రజాస్వామ్యానికి పునాది: నెమలి అనిల్ కుమార్

Facebook
X
LinkedIn

మల్లాపూర్, :

ప్రజాస్వామ్య వ్యవస్థకు పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితానే బలమైన పునాది అని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ అన్నారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని ఉమ్మడి మల్లాపూర్ డివిజన్‌లో కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సూచనల మేరకు ఉమ్మడి మల్లాపూర్ డివిజన్‌లో SIR కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ (BLA) బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

అర్హులైన ఓటర్ల పేర్లు ఏ పరిస్థితుల్లోనూ జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పులు, ఇతర వివరాల నవీకరణ ప్రక్రియల్లో ప్రజలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించడంతో పాటు, ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.

SIR ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించబడేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, BLAలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.