నేతాజీ నగర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

Facebook
X
LinkedIn

సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనకు వినతిపత్రం అందజేసిన బేరి రామ్‌చందర్ యాదవ్

శేరిలింగంపల్లి, :

నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేతాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బేరి రామ్‌చందర్ యాదవ్ కాలనీవాసులతో కలిసి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనకు సోమవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగండ్ల చెరువు నుంచి 33 అడుగుల నాలా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఆ పనుల ప్రభావంతో నేతాజీ నగర్ కాలనీలోని రెండు ప్రధాన రహదారులు నాలా విస్తరణలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కాలనీలో పేద, మధ్యతరగతి కుటుంబాలు అధిక సంఖ్యలో నివసిస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నాలా నిర్మాణాన్ని కొంత మేర మార్పులు చేసి చేపట్టాలని కోరారు.

అలాగే కాలనీలో మురుగునీరు నిల్వ ఉండటంతో దుర్వాసనలు వెదజల్లుతున్నాయని, ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 33 అడుగుల నాలాకు మురుగునీటి ఔట్‌లెట్ కల్పించి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాలనీలో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయని, వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. దాదాపు 3,000 మంది పేద, మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో చిన్నారులు, వృద్ధులు వినియోగించుకునే పార్కు లేకపోవడంతో అందుబాటులో ఉన్న పార్కు స్థలాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన కమిషనర్ సృజన సమస్యలపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కాలనీవాసుల సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రసాద్, రాజు, గణేష్‌తో పాటు కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.