అన్నారాయని చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు

Facebook
X
LinkedIn

నాగారం :

నాగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 332లో ఉన్న అన్నారాయని చెరువు శిఖం భూమిలో తప్పుడు గ్రామకంఠం రికార్డులు సృష్టించి అక్రమంగా గృహ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ నాగారం వాసులు బైరెడ్డి మల్లారెడ్డి, సుధాకర్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం, చెరువు శిఖం భూమిని గ్రామకంఠం భూమిగా చూపిస్తూ కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయమై పలుమార్లు మండల తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న సమయంలో, చెరువు శిఖం భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను అరికట్టడంలో స్థానిక రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు రికార్డుల ఆధారంగా చేపడుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, సంబంధిత భూముల రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చెరువు శిఖం భూములను కాపాడేందుకు, అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకుని బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.