బంజారా కాలనీలో 100 కుటుంబాలకు ఆరోగ్య భరోసా

Facebook
X
LinkedIn

కేఎస్‌ఎస్ హెల్త్ కార్డులతో వైద్య సేవలపై 50 శాతం వరకు రాయితీ

హైదరాబాద్, :

వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేలా కేఎస్‌ఎస్ చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్ ప్రత్యేక హెల్త్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాప్రా డివిజన్ పరిధిలోని బంజారా కాలనీలో 100 నిరుపేద కుటుంబాలకు హెల్త్ కార్డులను పంపిణీ చేసి ఆరోగ్య భరోసా కల్పించింది.

కేఎస్‌ఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నయీమ్ సహకారంతో, గోగికర్ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ హెల్త్ కార్డుల ద్వారా గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్య సేవలు, పరీక్షలు, చికిత్సలపై 50 శాతం వరకు ప్రత్యేక రాయితీ పొందే అవకాశం కల్పించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్నదే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అనారోగ్య సమయంలో ఆర్థిక భారం కారణంగా చికిత్సకు దూరమవుతున్న కుటుంబాలకు ఈ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, నిరుపేదలు, వృద్ధులు, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఉపశమనం కలిగిస్తుందన్నారు.

కాప్రా డివిజన్‌లో ఆరోగ్య పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కుటుంబాలకు హెల్త్ కార్డులు అందజేసి సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. “ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యం.. ప్రతి బీద కుటుంబానికి ఆరోగ్య భరోసా అందించడమే మా సంకల్పం” అని నిర్వాహకులు స్పష్టం చేశారు.

కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, ట్రస్ట్ సభ్యులు, మహిళలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హెల్త్ కార్డుల పంపిణీతో బంజారా కాలనీ వాసుల్లో ఆనందం వ్యక్తమైంది.