అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలను సీజ్ చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్
హైదరాబాద్ :
నాచారం పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ డీజీ పాఠశాలపై తక్షణ చర్యలు తీసుకుని, అవసరమైతే సీజ్ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి డిమాండ్ చేసింది. విద్యాశాఖ అనుమతులు లేకుండా, పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన ప్రాంతంలో పాఠశాల నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో ఏఐవైఎఫ్ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సోమవారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యాసంస్థల నిర్వహణ విద్యార్థుల ఆరోగ్యానికి, భద్రతకు, భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదకరమని అన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం నాచారం ప్రాంతం రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్న పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందిందని, ఇలాంటి ప్రాంతాల్లో గాలి, నీరు, శబ్ద కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు.

విద్యాసంస్థల స్థాపనకు విద్యాశాఖ, స్థానిక సంస్థలు, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల నుంచి అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థుల భద్రతకు సంబంధించిన అన్ని ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎస్ఆర్ డీజీ పాఠశాలకు సంబంధించిన అనుమతులు, భవన భద్రత, భూ వినియోగ నిబంధనలు, కాలుష్య పరిస్థితులపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అనుమతులు పొందిన, నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న విద్యాసంస్థల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడే పరిస్థితుల్లో నడుస్తున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన విద్యా వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, పారిశ్రామిక కాలుష్యానికి గురయ్యే ప్రాంతాల్లో విద్యాసంస్థల నిర్వహణను అనుమతించరాదని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, స్థానిక సంస్థల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నియోజకవర్గ నాయకులు అలీ, సుధీర్, కిరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ధర్నా అనంతరం ఉప్పల్ మండల విద్యాశాఖ అధికారి రామారావు స్పందించి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యానికి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు ఏఐవైఎఫ్ నాయకులు తెలిపారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.