కుషాయిగూడ పీహెచ్‌సీ నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలి

Facebook
X
LinkedIn

జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కుషాయిగూడ :

కుషాయిగూడ ప్రధాన రోడ్డులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో, అదే ప్రదేశంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనాన్ని నిర్మించాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి, ఐఏఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుషాయిగూడ, ఏఎస్‌రావునగర్, ఈసీఐఎల్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పాతబడిపోయి ప్రమాదకర స్థితికి చేరుకుందని తెలిపారు. భవనం బలహీనంగా మారడంతో రోగులు, వైద్య సిబ్బంది, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా గర్భిణీ మహిళలు, చిన్నారులకు టీకాలు వేయించేందుకు వచ్చే తల్లిదండ్రులు, వృద్ధులు మరియు ఇతర రోగులు ప్రస్తుత భవనం పరిస్థితి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సరైన మౌలిక సదుపాయాల లేమితో వైద్య సేవల అందజేతలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు.

కుషాయిగూడ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాభా గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విశాలమైన గదులు, ఆధునిక వైద్య సదుపాయాలు, తగిన పార్కింగ్, తాగునీటి వసతి, పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన నూతన పీహెచ్‌సీ భవనం నిర్మాణం అత్యవసరమని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నూతన భవన నిర్మాణానికి అవసరమైన పరిపాలనా అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, పార్టీ నాయకులు మహేష్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, సహ కార్యదర్శి నాలచెరువుల జనార్దన్, సీనియర్ ఉపాధ్యక్షుడు చల్ల వెంకటేష్, సారా అనిల్ ముదిరాజ్, గంప కృష్ణ, అసోసియేషన్ సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా కుషాయిగూడ పీహెచ్‌సీని ఆధునికీకరించి నూతన భవనాన్ని నిర్మిస్తే వేలాది మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.