పిల్లల పౌష్టికాహారం పాలను నేలపాలు చేయొద్దు

Facebook
X
LinkedIn

హైదరాబాద్ చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి జి రోజా రాణి

హైదరాబాద్ :

పాలాభిషేకాలు, క్షీరాభిషేకాల పేరుతో పాలను వృథా చేయకుండా పిల్లల పోషకాహారానికి వినియోగించాలని హైదరాబాద్ చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి జి రోజా రాణి విజ్ఞప్తి చేశారు. తల్లిపాల తర్వాత పిల్లలకు పాలు అత్యంత ముఖ్యమైన పోషకాహారమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం 1 నుంచి 10 ఏళ్ల పిల్లలకు రోజుకు సగటున 400–600 మిల్లీలీటర్ల పాలు అవసరమని పేర్కొన్నారు.
తెలంగాణలో సుమారు 65 లక్షల మంది చిన్నారులు ఉండగా, వారికి అవసరమైన పోషకాహారం అందించడం సమాజం బాధ్యత అని తెలిపారు. క్యాల్షియం, విటమిన్-డి, ప్రోటీన్ల కోసం పాలు, పాల పదార్థాలు తప్పనిసరిగా సమతుల్య ఆహారంలో ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో పాల ఉత్పత్తి, పాడి పరిశ్రమ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని విలువైన పాలను వృథా చేయకుండా అవసరమైన పిల్లలకు అందేలా చూడాలని కోరారు. పాలాభిషేకాలకు బదులుగా అదే పాలను అనాథాశ్రమాలు, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు అందిస్తే సమాజానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు .
ఈ మేరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు పాలను వృథా చేసే కార్యక్రమాలకు దూరంగా ఉండి చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారించాలని హైదరాబాద్ చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి జి. రోజా రాణి విజ్ఞప్తి చేశారు.