కల్తీ ఆహారంపై ఉక్కుపాదం అవసరం

Facebook
X
LinkedIn

ఆహార భద్రత అమలులో ప్రభుత్వాలు మరింత చొరవ చూపాలి: క్యాట్కో

హైదరాబాద్:

దేశవ్యాప్తంగా ఆహార కల్తీ మహమ్మారిలా విస్తరిస్తోందని, వినియోగదారుల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతోందని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (క్యాట్కో) అధ్యక్షుడు శంకర్‌లాల్ చౌరసియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు.

పాలు మొదలుకొని నిత్యావసర ఆహార పదార్థాల వరకు అధిక లాభాల కోసం కల్తీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుమందుల ప్రభావం మానవాళిపై తీవ్రంగా పడుతోందన్నారు. పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల్లో రసాయన అవశేషాలు పెరగడం ఆందోళనకరమని తెలిపారు.

ముప్పై ఏళ్ల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన అధ్యయనాల్లో పత్తి చేలలో పనిచేసే తల్లుల పాలలో సైతం రసాయన అవశేషాలు ఉన్నట్లు వెల్లడైందని గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో నిషేధించిన కొన్ని రసాయనాలు, పురుగుమందులు మన దేశంలో ఇప్పటికీ వినియోగంలో ఉండటం బాధాకరమన్నారు. అలాగే జన్యుమార్పిడి విత్తనాలు (జీఎంఓ) మరియు వాటి ఉత్పత్తుల వినియోగం పెరుగుతోందని పేర్కొన్నారు.

ఆహార భద్రత చట్టాల అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం, నాణ్యత పరీక్షించే ప్రయోగశాలల కొరత, తగిన సిబ్బంది లేకపోవడం వంటి కారణాలతో పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు. ఉత్పత్తిదారులు, వ్యాపారులు, అధికారులు ఆహార భద్రత చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన “వన్ నేషన్–వన్ ఫుడ్ లా” అమలులో భాగంగా ప్రతి లక్ష జనాభాకు ఒక ఫుడ్ సేఫ్టీ అధికారిని నియమించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, రాష్ట్రాల్లో వాటి అమలు ఆశించిన స్థాయిలో లేదని తెలిపారు. గతంలో తెలంగాణలో పలుజిల్లాలకు కలిపి ఒకే ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఉండే పరిస్థితి నెలకొనేదని గుర్తు చేశారు.

ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకాలు పెరగడం, ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. నగరంలో, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న కల్తీ దందాలను వెలికితీసేందుకు ప్రత్యేక బృందాల ద్వారా చర్యలు చేపడుతున్న అధికారులను అభినందించారు.

కల్తీ నియంత్రణలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, వినియోగదారుల సంఘాలు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని శంకర్‌లాల్ చౌరసియా పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఆహార భద్రతపై నిరంతర పర్యవేక్షణ, కఠిన చర్యలు అవసరమని ఆయన సూచించారు.