కలెక్టరేట్ ఎదుట ధర్నా.. కలెక్టర్‌కు వినతిపత్రం
మేడ్చల్, :
ఆహార భద్రత పేదల రాజ్యాంగబద్ధ హక్కు అని, దానిని కుదించేలా జాతీయ ఆహార భద్రత చట్టంలో సవరణలు చేయాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌పీఆర్‌డీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మోను చౌదరికి వినతిపత్రం అందజేశారు.
దేశంలో కోట్లాది మంది ప్రజలు ఇప్పటికీ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలకు దూరంగా ఉన్నారని, అర్హుల సంఖ్యను పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం విరుద్ధంగా కోతలకు సిద్ధమవుతోందని విమర్శించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పిల్లల్లో పోషకాహార లోపం, తక్కువ బరువు, రక్తహీనత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని గుర్తు చేశారు.

అంత్యోదయ అన్న యోజన కింద ప్రస్తుతం కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యం అందుతుండగా, దానిని వ్యక్తి ప్రాతిపదికన 7 కిలోలకు పరిమితం చేసే ప్రతిపాదనను తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం చిన్న కుటుంబాలు, నిరుపేదలు, ముఖ్యంగా వికలాంగుల కుటుంబాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు.
వికలాంగుల కుటుంబాలు మందులు, పునరావాసం, సహాయక పరికరాలు, రవాణా వంటి అవసరాల కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని, అలాంటి పరిస్థితుల్లో అంత్యోదయ రేషన్ వారికి కీలక ఆధారంగా ఉందన్నారు. అర్హతలను కుదించడం జీవించే హక్కును కాలరాయడమేనని వ్యాఖ్యానించారు.
వికలాంగుల హక్కుల చట్టం అమలుపై ఆందోళన
2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర వికలాంగుల సలహా మండలిని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2019లో ఏర్పాటైన మండలి కాలపరిమితి ముగిసి నాలుగేళ్లు గడిచినా కొత్త మండలిని ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ప్రాధాన్యం ఇవ్వాలి
జిల్లాలో మిగిలి ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను మొదటగా అర్హులైన వికలాంగులకు కేటాయించాలని కోరారు. అలాగే తీవ్రమైన వైకల్యాలు ఉన్నవారికి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయాలని, వికలాంగుల అదనపు పోషకాహార అవసరాలను గుర్తించి ప్రత్యేక పోషకాహార మద్దతు అందించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్ట సవరణలపై వెనక్కి తగ్గకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు కె. చంద్రమోహన్, లక్ష్మీపతి, రమేష్, మల్లేష్, షైన్‌బేగం, శివ, రజిత, మేఘమాల, శ్రీను తదితరులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.