ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన మాజీ మేయర్

Facebook
X
LinkedIn

మేడిపల్లి:

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సత్యనారాయణపురం కాలనీలో కొనసాగుతున్న కార్యక్రమాన్ని సందర్శించి దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బీఎల్‌వోలు, బీఆర్‌ఎస్‌ పార్టీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లతో కలిసి నమోదు ప్రక్రియను పరిశీలించిన వారు, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయింపుకు గురికాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని పేరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను సకాలంలో సమర్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్‌రెడ్డి, నాయకులు శశిధర్‌రెడ్డి, వెంకట్‌, కృష్ణారెడ్డి, సతీష్‌, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, బీఎల్‌వోలు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.