ఉప్పల్ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తా

Facebook
X
LinkedIn

నాచారం సభలో సీఎం రేవంత్ రెడ్డి హామీ

నాచారం, :

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైనన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.

నాచారంలో బాలామృతం నూతన ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సమక్షంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, రామంతాపూర్ చిన్న చెరువు, నాచారం పటేల్‌కుంట చెరువుల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. చెరువుల అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే చర్యలు చేపడతామని చెప్పారు.

అదేవిధంగా ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థల కేటాయింపుతో పాటు భవన నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సీఎం హామీలతో ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కొత్త ఊతం లభించనుందని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.