99 రోజుల ‘ప్రజా కళలు’ కార్యక్రమంపై ప్రశ్నల వర్షం
హైదరాబాద్, :
భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 99 రోజుల ‘ప్రజా కళలు’ కార్యక్రమంలో జానపద, గిరిజన కళాకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్‌కే), సకల కళల జేఏసీ నాయకులు ఆరోపించారు. కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని టీపీఎస్‌కే హాల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రజా కళలు, జానపద కళలు, గిరిజన కళల పరిరక్షణ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది జానపద కళాకారులకు అవకాశం కల్పించలేదన్నారు. ఈ అంశాలపై సమాచార హక్కు చట్టం-2005 కింద భాషా, సాంస్కృతిక శాఖకు వినతిపత్రం సమర్పిస్తున్నట్లు తెలిపారు.
సకల కళల జేఏసీ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్, ఇప్పటివరకు చేసిన ఖర్చులు, ఎంపికైన కళాకారుల సంఖ్య, ఎంపిక ప్రమాణాలు, చెల్లించిన పారితోషికాలు, కార్యాచరణ ప్రణాళిక తదితర వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముతో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై పూర్తి పారదర్శకత ఉండాల్సిందేనన్నారు.
జేఏసీ ఉపాధ్యక్షుడు గూరుజీ సాధు మహారాజ్ మాట్లాడుతూ ప్రజా కళల అభివృద్ధే లక్ష్యమైతే ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. జానపద సకల కళల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య మాట్లాడుతూ జానపద కళాకారులను పక్కనపెట్టి కార్యక్రమాలు నిర్వహించడం ప్రజా కళల ఆత్మను అవమానించడమేనన్నారు. గ్రామీణ కళాకారులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ప్రభుత్వం సాంస్కృతిక సంస్థల సూచనలను పరిగణనలోకి తీసుకొని కార్యక్రమాలు రూపొందించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధ ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ సమావేశంలో పొన్నం రాజయ్య, కొల జనార్ధన్, వి. కురుమూర్తి, ఖాజా మొహీనుద్దీన్, దాట్ల నిర్మల, తాండ్ర స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
‘సిగ్గు సిగ్గు’ నినాదాలు
సమావేశం అనంతరం జానపద కళాకారులు, సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు “జానపద కళలకు అవకాశం లేని 99 రోజుల ప్రజా కళలు కార్యక్రమం సిగ్గు సిగ్గు” అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జానపద కళాకారులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.