హైదరాబాద్, :
రాష్ట్ర అటవీదళాల నూతన ప్రధాన సంరక్షణాధికారి (పీసీసీఎఫ్)గా బాధ్యతలు స్వీకరించిన వినయ్‌కుమార్‌ను అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్రంలో అటవీ సంపద పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపు, జీవవైవిధ్య సంరక్షణ, సామాజిక అటవీ కార్యక్రమాల అమలు, వనమహోత్సవాన్ని విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపై మంత్రి, పీసీసీఎఫ్ సమగ్రంగా చర్చించారు.
అటవీ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
అటవీ శాఖ కార్యక్రమాల అమలులో సాంకేతికత వినియోగాన్ని పెంచడంతో పాటు అటవీ రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని, పచ్చదనం పెంపు, అటవీ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంత్రి వినయ్‌కుమార్‌కు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అటవీ శాఖ పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ హామీ ఇచ్చారు. అడవుల సంరక్షణకు విశేష సేవలు అందిస్తున్న అటవీ అధికారులు, సిబ్బందికి వార్షిక అవార్డులు, నగదు ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం అటవీ సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు.
మాజీ పీసీసీఎఫ్ సువర్ణకు సత్కారం
పదవీ విరమణ అనంతరం తనను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ పీసీసీఎఫ్ సువర్ణను మంత్రి కొండా సురేఖ చీరతో సత్కరించి అభినందించారు. అటవీ శాఖ అభివృద్ధికి ఆమె అందించిన సేవలను ప్రశంసించారు. పదవీవిరమణ అనంతర జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.