నాగారం కాంగ్రెస్ అధ్యక్ష నియామకంపై అసంతృప్తి.. సీనియర్ నేతల ఆక్షేపణ

Facebook
X
LinkedIn

నాగారం :

మేడ్చల్ జిల్లాలోని పలు డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను పీసీసీ నియమించిన నేపథ్యంలో నాగారం డివిజన్ అధ్యక్షుడిగా ఎలసాని భూమయ్య యాదవ్ నియామకాన్ని స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యతిరేకించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పక్కనపెట్టి, బంధుత్వాలకు ప్రాధాన్యం ఇస్తూ పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఎలసాని భూమయ్య యాదవ్ నియామకం కూడా అలాంటి పరిణామమేనని పేర్కొన్నారు. దీంతో పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నాయకుడు చిన్నంరాజు సతీష్ గౌడ్ మాట్లాడుతూ.. తాను రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ పదవులు దక్కలేదని, అయితే బంధుత్వ కారణాలతోనే భూమయ్య యాదవ్‌కు డివిజన్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని విమర్శించారు. ఇది సామాన్య కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే నిర్ణయమని అన్నారు.

మాజీ సర్పంచ్ గూడూరు అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాం నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్నామని తెలిపారు. సీనియర్ నాయకులకు కనీస గౌరవం ఇవ్వకుండా కొందరు నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో నాగారం డివిజన్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పంగ హరిబాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దాసోహం నర్సింగ్‌రావు, బాలు యాదవ్, దాసరి రాంరెడ్డి, కిట్టు యాదవ్, సత్యనారాయణ యాదవ్, రవి, పంగ శ్రీహరి, గౌస్, ప్రవీణ్ యాదవ్, రామగోని శ్రీనివాస్ గౌడ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.