వీబీజీ రామ్‌జీ బిల్లు రద్దు చేయాలి: ఎన్‌పీఆర్‌డీ నిరసన

Facebook
X
LinkedIn

మేడ్చల్ :

వికలాంగుల పట్ల వివక్ష చూపే విధంగా ఉన్న వీబీజీ రామ్‌జీ బిల్లు–2025ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర, కేంద్ర కమిటీల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు.

ఈసీఐఎల్ చౌరస్తా వద్ద జిల్లా కార్యదర్శి కడలి నాగలక్ష్మి ఆధ్వర్యంలో ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్‌జీ బిల్లును రద్దు చేసి, వికలాంగులకు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఉపాధి అవకాశాలు లేకపోతే వికలాంగులు తీవ్ర అన్యాయానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.

వికలాంగులు గౌరవప్రదంగా జీవించేందుకు ఉపాధి అత్యంత అవసరమని, తమ కాళ్లపై తాము నిలబడే అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వికలాంగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే దేశవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు షైన్ బేగం, రజిత, శోభారాణి, కోటయ్య, వెంకటేష్, లక్ష్మి, హిరణ్య తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా జైజాన్ కాలనీ కమాన్ వద్ద ఎన్‌పీఆర్‌డీ మేడ్చల్ జిల్లా సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో మరో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కడలి నాగలక్ష్మి హాజరయ్యారు. సర్కిల్ కమిటీ అధ్యక్షుడు ఏ. నాగరాజు మాట్లాడుతూ వికలాంగుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న వీబీజీ రామ్‌జీ బిల్లు–2025ను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసి వారి జీవితాల్లో వెలుగు నింపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

వికలాంగులు ఆత్మగౌరవంతో సమాజంలో జీవించాలంటే స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల హక్కులను పరిరక్షించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏ. అమరావతి, చంద్రశేఖర్, సత్యప్రసాద్, చంద్ర, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.