ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ పర్యవేక్షణ

Facebook
X
LinkedIn

కూకట్‌పల్లి, :

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ మను చౌదరి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్‌తో కలిసి హౌసింగ్ బోర్డు తిరుమల హిల్స్ ప్రాంతంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ బీఎల్‌ఓల పనితీరుపై ఆరా తీశారు. ప్రతిరోజు ఉదయం బీఎల్‌ఓల హాజరు వివరాలను సేకరించి పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్ని ఎన్యూమరేషన్ పత్రాలు అందజేస్తున్నారో, ఒక్కో కుటుంబానికి ఎన్ని ఫారాలు ఇస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎన్రోల్మెంట్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేసి అప్‌లోడ్ చేసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.

దీనికి స్పందించిన బీఎల్‌ఓలు ప్రతి అర్హ ఓటరుకు రెండు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేస్తున్నామని, అనంతరం సెల్‌ఫోన్‌లోని ఎన్రోల్మెంట్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలను అప్‌లోడ్ చేస్తున్నామని వివరించారు. పత్రాలు పంపిణీ చేసిన వెంటనే వాటి వివరాలను యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

అలాగే ఓటర్ల మ్యాపింగ్‌లో నమోదు కాని వ్యక్తుల వివరాలను సంబంధిత బీఎల్‌ఏలతో సమన్వయం చేసుకుని గుర్తించాలని, వారికి కూడా ఎన్యూమరేషన్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

ఈ పర్యటనలో కూకట్‌పల్లి తహసీల్దార్ అశోక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.