నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని విజ్ఞప్తి

Facebook
X
LinkedIn

స్త్రీ, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శికి ఎన్పీఆర్‌డీ వినతి

హైదరాబాద్, :

రాష్ట్రంలోని ప్రైవేట్, సీబీఎస్‌ఈ అనుబంధ విద్యాసంస్థల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం స్పెషల్ ఎడ్యుకేటర్లను తప్పనిసరిగా నియమించాలని, నిబంధనలు అమలు చేయని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే గుర్తింపును రద్దు చేయాలని నేషనల్ ప్లాట్‌ఫామ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది డిసేబుల్డ్ (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు స్త్రీ, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పలు ప్రైవేట్, సెంట్రల్ బోర్డు (సీబీఎస్‌ఈ) పాఠశాలల్లో వికలాంగ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

చట్టాలు ఉన్నా అమలు శూన్యం

వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం–2016లోని సెక్షన్ 16, 17తో పాటు 2018 మే 1న జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.3 ప్రకారం ప్రతి గుర్తింపు పొందిన విద్యాసంస్థ అంగవైకల్యం కలిగిన పిల్లలకు సమగ్ర విద్యను అందించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచాలని నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ రాష్ట్రంలోని చాలా విద్యాసంస్థల్లో అవి అమలు కావడం లేదన్నారు.

అలాగే సీబీఎస్‌ఈ అనుబంధ నిబంధనలు, 2024 మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ సౌకర్యాలు, స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకం తప్పనిసరి అయినప్పటికీ అనేక పాఠశాలలు వాటిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేయాలి

రాష్ట్రంలోని అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు బహుళ అంతస్తుల భవనాల్లో కొనసాగుతున్నప్పటికీ వికలాంగ విద్యార్థుల కోసం లిఫ్టులు, ర్యాంపులు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం ఆందోళనకరమన్నారు. ప్రతి విద్యాసంస్థలో అందుబాటు ప్రమాణాలను అమలు చేసి వికలాంగ విద్యార్థులకు సులభంగా చేరుకునే వాతావరణాన్ని కల్పించాలని కోరారు.

అంగవైకల్యం కలిగిన పిల్లలకు ప్రవేశాలు కల్పించడంతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్లు, రిసోర్స్ టీచర్లను నియమించడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

వికలాంగ మహిళలకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి

రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, సహాయ టీచర్ల నియామకాలలో 5 శాతం పోస్టులను వికలాంగ మహిళలకు కేటాయించాలని వినతిపత్రంలో కోరారు. ఈ అంశాలపై కార్యదర్శి అనితా రామచంద్రన్ సానుకూలంగా స్పందించినట్లు కె. వెంకట్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీవీహెచ్‌ఎస్ కార్యదర్శి శివకృష్ణ పాల్గొన్నారు.