జిల్లాలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం

Facebook
X
LinkedIn

జూన్ 28న 0–5 ఏళ్ల చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు

5.31 లక్షల మంది చిన్నారులకు లక్ష్యం

1,203 బూత్‌లు, ప్రత్యేక మొబైల్ బృందాల ఏర్పాటు

మేడ్చల్, :

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం–2026 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సి. ఉమా గౌరి తెలిపారు. జిల్లాలో ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించకుండా మిగిలిపోకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

జూన్ 28న (ఆదివారం) నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లాలోని 0 నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి సమీప పోలియో బూత్‌లలో పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. తొలి రోజు బూత్‌లకు రాని చిన్నారులను గుర్తించి జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

5.31 లక్షల మంది చిన్నారులకు లక్ష్యం

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మొత్తం జనాభా 48,28,324 కాగా, జిల్లాలో 14,46,993 గృహాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు 5,31,328 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.

అధిక ప్రమాద ప్రాంతాలు, వలస మరియు సంచార కుటుంబాలు నివసించే 300 ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లోని 10,717 మంది చిన్నారులకు ప్రత్యేక బృందాల ద్వారా పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు.

విస్తృత ఏర్పాట్లు

కార్యక్రమం కోసం జిల్లాలో 1,203 పల్స్ పోలియో బూత్‌లు, 40 మొబైల్ బృందాలు, 31 ట్రాన్సిట్ పాయింట్లు, 32 కోల్డ్ చైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు.

మొదటి రోజు ప్రతి పోలియో బూత్‌లో నలుగురు సభ్యులతో కూడిన బృందాలు విధులు నిర్వర్తించనున్నాయి. రెండో, మూడో రోజులలో ఇంటింటి సర్వే నిర్వహించే బృందాల్లో ఇద్దరు సభ్యులు పనిచేస్తారని తెలిపారు.

వేలాది మంది సిబ్బంది సేవలు

పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కోసం ప్రభుత్వ శాఖల అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, నర్సింగ్, పారామెడికల్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, వాలంటీర్లు సేవలందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు, కార్పొరేట్ ఆసుపత్రులు కూడా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాయని పేర్కొన్నారు.