హైడ్రా అవసరమే.. పేదల పునరావాసం మరిచిపోవద్దు

Facebook
X
LinkedIn

రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్

హైదరాబాద్, :

నగరంలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా చేపడుతున్న చర్యలు అవసరమైనవేనని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పేర్కొన్నారు. అయితే ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో పేదలు, బలహీన వర్గాల జీవన హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర లోకతాంత్రిక వేదిక (టీఆర్ఎల్డీ) ఆధ్వర్యంలో లక్షీకాపూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, హైడ్రా పనితీరుపై విస్తృతంగా మాట్లాడారు. చెరువులు, కుంటల పరిరక్షణతో పాటు నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హైడ్రా ముందుకు సాగుతోందని, ఈ క్రమంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు.

అయితే దశాబ్దాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలను ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఖాళీ చేయించడం సామాజికంగా ఆమోదయోగ్యం కాదన్నారు. కూల్చివేతలకు ముందు బాధితులకు తగిన పరిహారం, పునరావాసం, జీవన భద్రత కల్పించే విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలని డిమాండ్ చేశారు.

సమావేశంలో పాల్గొన్న మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి పర్గేన్ మాట్లాడుతూ చెరువులు, కుంటల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ, జలవనరుల రక్షణ కోసం ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా బాధ్యత తీసుకోవాలని సూచించారు.

మాజీ ఐఏఎస్ వెంకటేశ్వర్లు, సామాజిక కార్యకర్త అదూరి కరుణ, టీఆర్ఎల్డీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వి.వి.ఎస్. సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ హైడ్రా చర్యలు పారదర్శకంగా, న్యాయబద్ధంగా సాగాలని అభిప్రాయపడ్డారు. చెరువుల పునరుద్ధరణతో పాటు పేదల హక్కుల పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.