హెల్మెట్ ధారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం

Facebook
X
LinkedIn

కుషాయిగూడ సీఐ ఎల్. భాస్కర్ రెడ్డి

కుషాయిగూడ, :

సమాజానికి మార్గదర్శకులుగా నిలిచే పాత్రికేయులు హెల్మెట్ ధారణ విషయంలో ఆదర్శంగా ఉండాలని కుషాయిగూడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎల్. భాస్కర్ రెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాప్రా సర్కిల్ కాప్రా ప్రెస్ క్లబ్ మదర్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కాప్రా ప్రెస్ క్లబ్ మదర్ కమిటీ అధ్యక్షుడు, భాగ్యనగర్ గ్రీన్ సిటీ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ వడ్లోజు జ్యోతిర్మయాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావుతో కలిసి సీఐ భాస్కర్ రెడ్డి పాత్రికేయులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు నిర్వహిస్తున్న ‘అరైవ్ ఆర్ లైవ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ప్రాణరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని, కుటుంబ సభ్యులందరూ ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

హెల్మెట్ ధారణ ప్రాముఖ్యతపై కుషాయిగూడ ఎస్‌ఐలు వెంకన్న, సుధాకర్ రెడ్డి అవగాహన కల్పించారు. కాప్రా ప్రెస్ క్లబ్ సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు తెలిపారు.

అనంతరం పాత్రికేయులు, పోలీసులు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320సీ తొలి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ మండా సురేష్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శ్రీనివాస్, కోశాధికారి వట్టిపెల్లి సురేష్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ నర్సింగ్ గౌడ్, శివరాజ్, రాజు పద్మశాలి, బోదాసు రవి, ధనలక్ష్మి, వాల్య నాయక్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.