సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతల డిమాండ్
మల్లాపూర్, :
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఐ మేడ్చల్ జిల్లా సమితి పిలుపు మేరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ), అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఉప్పల్ నియోజకవర్గ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో మల్లాపూర్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలను శనివారం సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీఐ ఉప్పల్ మండల కార్యదర్శి టి. సత్యప్రసాద్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్, అజీమ్ పాషా, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు వికాస్ మాట్లాడుతూ పాఠశాలల్లో తాగునీటి కొరత, మరుగుదొడ్ల నిర్వహణ లోపాలు, తరగతి గదుల మరమ్మతుల అవసరం, విద్యుత్ సౌకర్యాల లేమి, ఫర్నిచర్ కొరత, పరిశుభ్రత సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి తెలుసుకున్నామని తెలిపారు.
ఈ నెల 15 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, బెంచీలు, డెస్కులు, బ్లాక్‌బోర్డులు, భద్రతా చర్యలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన సామగ్రిని విద్యా సంవత్సరం తొలి రోజు నుంచే అందుబాటులో ఉంచాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేసి నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే సమాజాభివృద్ధికి పునాది అని పేర్కొన్న నాయకులు, పాఠశాలల అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సమీర్, కుమార్, సలీం, నరేష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.