చేయూత పెన్షన్లపై ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి

Facebook
X
LinkedIn

పెన్షన్లు పెంచకపోతే ఉద్యమం తప్పదు: ఎన్‌పీఆర్‌డీ

సెర్ప్ కార్యాలయం ఎదుట ధర్నా.. డైరెక్టర్‌కు వినతిపత్రం

హైదరాబాద్, జూన్ 10:

రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి కొత్తగా రెండు లక్షల మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) డిమాండ్ చేసింది. పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరులో జాప్యం కొనసాగితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది.

ఈ మేరకు ఎన్‌పీఆర్‌డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సెర్ప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అనంతరం సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం వికలాంగుల పెన్షన్‌ను రూ.4,016 నుంచి రూ.6,000కు, ఇతర చేయూత పెన్షన్లను రూ.2,016 నుంచి రూ.4,000కు పెంచుతామని ప్రకటించిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా హామీల అమలులో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు.

2023 డిసెంబర్‌లో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా కొత్త పెన్షన్ల కోసం లక్షలాది దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఇప్పటికీ అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు కాలేదన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి స్వయంగా జూన్ 2 నుంచి రెండు లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ అమలు జరగలేదని ఆరోపించారు.

చేయూత పెన్షన్ల కోసం ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తుల వివరాలను వర్గాలవారీగా వెల్లడించాలని, పెన్షన్లను పోస్టాఫీసుల ద్వారా కాకుండా బ్యాంకుల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ మాట్లాడుతూ మహిళా సంఘాలకు కేటాయిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో వికలాంగ మహిళలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం సంక్షేమ పథకాలలో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో చేపడుతున్న ముఖగుర్తింపు ప్రక్రియలో తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారికి ఇంటి వద్దనే ముఖగుర్తింపు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం స్పందించిన సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తి, చేయూత పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరు అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. వికలాంగ మహిళలకు ఆర్టీసీ బస్సుల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామని, వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దనే ముఖగుర్తింపు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర, జిల్లా నాయకులు, గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వికలాంగులు పాల్గొన్నారు.