75 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణతో చరిత్ర సృష్టించిన తెలంగాణ : మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ లక్ష్యాలను క్రమంగా తగ్గిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి చరిత్ర సృష్టించిందన్నారు.

మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సహచర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లోక్‌సభ సభ్యుడు రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా సాగుతుండగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగా రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బీజేపీ నేతలు కొనుగోలు కేంద్రాల యాత్రల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

తెలంగాణలో వరి ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించే ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తాను పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆహార శాఖ, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారులను కోరినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. రైతుల అవసరాలను పక్కనబెట్టి పరిమిత లక్ష్యాలను విధించడం వల్ల రాష్ట్రంపై అదనపు భారం పడిందన్నారు.

అయితే రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుని కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి ధాన్యం కొనుగోలు చేసిందని చెప్పారు. రబీ 2025-26 సీజన్‌లో రాష్ట్రంలో 65.91 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేయబడిందన్నారు.