ఫార్మా హబ్’ ఏర్పాటుకు పూర్తిస్థాయి సహకారం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ :
రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యంగా ఘనాలో ఏర్పాటు చేయనున్న ‘ఫార్మా హబ్’ అభివృద్ధికి తెలంగాణ తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఘనా ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆగస్టస్ ఒబువాడుం టానో నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ–ఘనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పెట్టుబడులు, పారిశ్రామిక సహకారం, వాణిజ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
ఘనా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘24 అవర్ ఎకానమీ అండ్ యాక్సలరేటెడ్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’, ఫార్మా హబ్ ఏర్పాటు తదితర అంశాలను ఆగస్టస్ ఒబువాడుం టానో వివరించారు. ఘనా పారిశ్రామిక పరివర్తనకు తెలంగాణ సహకారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అతి తక్కువ కాలంలోనే తెలంగాణ పారిశ్రామిక రంగంలో విశేష పురోగతి సాధించిందన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో రాష్ట్రం అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగిందని తెలిపారు.
పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాలను ఘనా ప్రతినిధులకు వివరించిన మంత్రి, ఫార్మాస్యూటికల్ తయారీ, పరిశోధన, వ్యాక్సీన్ ఉత్పత్తి, గ్లోబల్ సప్లై చైన్ నిర్వహణ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణకు ఉన్న అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఘనా పారిశ్రామిక, ఆర్థిక పరివర్తనలో తెలంగాణ విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఈ భేటీ రెండు ప్రాంతాల మధ్య పారిశ్రామిక, వాణిజ్య సహకారానికి కొత్త అవకాశాలు తెరుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.