హైదరాబాద్ :
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఆరు ప్రధాన మహానగరాల్లో హైదరాబాద్ ఒకటని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
సోమవారం మియాపూర్‌లో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కలకత్తా, చెన్నై, హైదరాబాద్ నగరాలే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇతర మహానగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉదహరిస్తూ, ఢిల్లీలో కాలుష్యం, ముంబైలో వర్షాకాల ముంపు, బెంగుళూరు, చెన్నై, కలకత్తాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌లో తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించిన కారణం ఇదే
హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పోలీస్, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం మెరుగుపడేలా పరిపాలనా సరిహద్దులను నిర్ణయించామని చెప్పారు. జెండాలు, ఎజెండాలకు అతీతంగా నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
విద్య, గృహ నిర్మాణం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం
పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు.
మహానగరంలో లక్ష LIG, MIG ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, గతంలో రాజీవ్ గృహకల్ప తరహాలో ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకే సమీపంలో గృహాలు నిర్మించి అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విముక్తం చేసి పేదల గృహ నిర్మాణానికి వినియోగిస్తామని తెలిపారు.
మహిళల సంక్షేమం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇందిరా మహిళా శక్తి ద్వారా 150 వాణిజ్య స్టాల్స్ మహిళలకు కేటాయించినట్లు చెప్పారు. మహిళలను పెట్రోల్ బంకుల యజమానులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
మెట్రో విస్తరణ, అంతర్జాతీయ బస్ టెర్మినల్
విశ్వనగరంగా ఎదగాలంటే అందుకు తగిన మౌలిక వసతులు అవసరమని పేర్కొంటూ మెట్రో రెండో దశ విస్తరణ పనులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గాజులరామారంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. మూడు నెలల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
తెలంగాణకు కేంద్ర నిధులపై బీజేపీ ఎంపీలను ప్రశ్నించిన సీఎం
తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎందుకు చొరవ చూపడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నిధుల సాధనలో ముందుండాలని సూచించారు.
గుజరాత్లో సబర్మతి నది అభివృద్ధిని ప్రశంసించే వారు, తెలంగాణలో మూసీ నది అభివృద్ధి కార్యక్రమాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని కోరారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధం
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, కేంద్రంలోని పన్నెండేళ్ల బీజేపీ పాలన, ప్రస్తుతం 30 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బహిరంగ చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎవరు రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేశారో, ఎన్ని నిధులు తెచ్చారో ప్రజల ముందే చర్చిద్దామని అన్నారు.
రాబోయే 24 నెలలు అభివృద్ధికే అంకితం
రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 24 నెలలు పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.