విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అవసరం..

Facebook
X
LinkedIn
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, తర్కబద్ధమైన ఆలోచన విధానం పెంపొందించడంలో జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థల పాత్ర అత్యంత కీలకం అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన సైన్స్ క్యాలెండర్‌ ను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. శాస్త్రీయ దృక్పథం లేని సమాజం ముందుకు సాగదు. అంధ విశ్వాసాలు, మూఢనమ్మకాలు తొలగించాలంటే విజ్ఞానంపై అవగాహన పెరగాలి అని స్పష్టం చేశారు. విజ్ఞానం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రజల రోజువారీ జీవితంలో భాగం కావాలని, ముఖ్యంగా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, తర్కబద్ధమైన ఆలోచన పెరిగితేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
సైన్స్ క్యాలెండర్‌లోని అంశాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ విజ్ఞాన సందేశం ఇచ్చేలా ఉన్నాయి. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని చైతన్యవంతం చేస్తాయి అని కలెక్టర్ తెలిపారు. ప్రజల్లో శాస్త్రీయ చైతన్యం కోసం జన విజ్ఞాన వేదిక చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే జన విజ్ఞాన వేదిక ప్రధాన లక్ష్యం. అంధ విశ్వాసాలు, మూఢనమ్మకాలపై పోరాటానికి విజ్ఞానమే ఆయుధం అని అన్నారు. సైన్స్ క్యాలెండర్‌ను కేవలం తేదీల కోసం కాకుండా, ప్రతి రోజు ఒక విజ్ఞాన ఆలోచన, ఒక తర్కబద్ధమైన సందేశం ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో రూపొందించామని తెలిపారు. పిల్లలు ప్రశ్నించాలి, ఆలోచించాలి. ప్రశ్నించని సమాజం ముందుకు సాగదని పేర్కొన్నారు. అందుకే విద్యార్థులు, యువతను కేంద్రంగా చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక చెకుముకి ఎడిటర్ ఆనంద్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోట శ్రీనివాస్, ఎస్.కె బురాన్, సీనియర్ నాయకులు మల్లయ్య చారి, శంకర్, సిహెచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.