మాతృభాష గొప్పతనాన్ని మరువొద్దు

Facebook
X
LinkedIn

తెలుగునాడు సమితి ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవ వేడుకలు

కుషాయిగూడ :
మాతృభాష గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని ప్రధాన ఉపాధ్యాయురాలు బి అరుణాదేవి అన్నారు. తెలుగునాడు సమితి ఆధ్వర్యంలో కుషాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో బి అరుణాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ తెలుగు నేలపై ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు నేర్చుకోవాలని, తెలుగులోనే మాట్లాడాలని, తద్వారా తెలుగు వికసించాలని ఆమే కోరారు.
తెలుగునాడు సమితి అధ్యక్షులు గుమ్మడి హరిప్రసాద్ మాట్లాడుతూ మన మాతృభాష అయినటువంటి తెలుగును మర్చిపోవద్దని, కొత్త విషయాలు ఎన్ని నేర్చుకున్న పాత విషయాలు మర్చిపోవద్దని, విద్యార్థులకు సూచించారు. ఇటువంటి భాషా దినోత్సవాలు తరచుగా పాఠశాలల్లో జరపాలని ఆయన కోరారు.


తెలుగునాడు సమితి ప్రధాన కార్యదర్శి ఎం రాంబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. తెలుగు భాష వికాసానికి, తెలుగు భాష పరిరక్షణకు 2003 సంవత్సరం నుండి తెలుగునాడు సమితి ఎంతో కృషి చేస్తుందని వివరించారు. ధరణి దినపత్రిక సంపాదకులు జి. రోజారాణి విద్యార్థులకు మాతృభాష ప్రాధాన్యతను తెలిపారు.


అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు జరిపిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు పి వీరేశలింగం, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.