దేశ రాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న వాయు కాలుష్యం 

Facebook
X
LinkedIn

న్యూ డిల్లీ :

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం  ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శుక్రవారం ఉదయం గాలి నాణ్యత సూచిక 380కి పడిపోయింది. తీవ్ర కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యానికి తోడు నగరాన్ని దట్టమైన పొగమంచు   కమ్మేసింది. దీంతో విజిబిలిటీ   దారుణంగా పడిపోయింది. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.దృశ్యమానత పడిపోవడంతో ఇవాళ ఉదయం ఢిల్లీకి రాకపోకలు సాగించే దాదాపు 152 విమానాలు రద్దయ్యాయి. వాటిలో 79 డిపార్చర్స్‌ కాగా, 73 అరైవల్స్‌ ఉన్నాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాలు రద్దుకాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందు ఫ్లైట్‌ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని సూచించింది. ఇండిగో, ఎయిర్‌ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు కూడా తమ ప్రయాణికులకు ఇలాంటి సూచనలే చేశాయి. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్‌, నోయిడా, ఘజియాబాద్‌లో దృశ్యమానత 100 మీటర్లుగా ఉంది.ఢిల్లీలోని 39 ఎయిర్‌ మానిటరింగ్‌ స్టేషన్లలో ఏకంగా 14 కేంద్రాల్లో ఏక్యూఐ లెవెల్స్‌ 400 కంటే ఎక్కువగానే నమోదయ్యాయి. అత్యధికంగా ఆర్కే పురంలో గాలి నాణ్యత సూచిక 447గా నమోదైంది. ఆ తర్వాత ఆనంద్‌ విహార్‌, వివేక్‌ విహార్‌, సిరిఫోర్ట్‌ ప్రాంతాల్లో 442గా నమోదైంది. ద్వారకా సెక్టరా-8లో 429, నెహ్రూ నగర్‌లో 425, ఎన్‌ఎస్‌ఐటీ ద్వారకా ప్రాంతంలో 423, డాక్టర్‌ కర్ణిసింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో 423, ఓఖ్లా ఫేజ్‌-2లో 422గా ఏక్యూఐ లెవెల్స్‌ నమోదయ్యాయి.