తిరుపతి నేషనల్‌ సాంస్కృతిక యూనివర్సిటీలో దారుణం

Facebook
X
LinkedIn

ఫస్టియర్‌ విద్యార్థినిని లైంగికంగా వేదించి గర్భవతిని చేసిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

 తిరుపతి :

తిరుపతి నేషనల్‌ సాంస్కృతిక యూనివర్సిటీలో దారుణం జరిగింది. ఫస్టియర్‌ విద్యార్థినిని ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లైంగికంగా వేధించి లోబరచుకున్నాడు. ఆమెను గర్భవతిని కూడా చేశాడు. ఈ విషయం తెలిసిన మరో ప్రొఫెసర్‌ ఆమెకు అండగా నిలబడాల్సిందిపోయి.. బ్లాక్‌మెయిల్‌ చేసి లైంగికంగా వేధించాడు.వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన ఓ యువతి నేషనల్‌ సాంస్కృతిక యూనివర్సిటీలో ఫస్టియర్‌ చదువుతోంది. ఆమెపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ లక్ష్మణ్‌కుమార్‌ కన్నేశాడు. ఆమెను లైంగికంగా వేధించిన ప్రొఫెసర్.. కొంతకాలం మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు విద్యార్థి గర్భం కూడా దాల్చింది. కాగా, ఇటీవల ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ కుమార్‌ వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయిన విద్యార్థిని.. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించిన వీసీ.. ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.ఈ ఘటన జరిగిన తర్వాత సదరు విద్యార్థిని ఒడిశాకు వెళ్లిపోయింది. అయితే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి అధ్యాపకులు తిరుపతి వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. కానీ బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. దీంతో ఈ విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే.. ఒడిశాకు చెందిన విద్యార్థినిని మరో ప్రొఫెసర్‌ కూడా లైంగికంగా వేధించినట్లు తెలిసింది. లక్ష్మణ్‌ కుమార్‌తో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రికార్డు చేసిన మరో ప్రొఫెసర్‌ ఆమెను లైంగికంగా లోబరచుకునేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపైనా విచారణ జరపాలని యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.