ప్రైవేట్ కంటే ప్రభుత్వ టీచర్లే బెస్ట్: సీఎం చంద్రబాబు

Facebook
X
LinkedIn

పార్వతీపురం :

ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తి ఉత్తమం
విదేశీ విద్యకు ‘కలలకు రెక్కలు’ పథకం – పావలా వడ్డీకే రుణం
మూడేళ్లలో ఏపీ విద్యను దేశంలో నంబర్–1 గా నిలుపుతాం: సీఎం
విద్యార్థుల్లో ఆవిష్కరణలకు ఇన్నోవేటర్స్ సమ్మిట్

పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో ఏర్పాటు చేసిన ‘మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 3.0’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు విద్యార్థులపై ఎక్కువ శ్రద్ధ చూపే అవకాశం ఉందని, “ప్రభుత్వ టీచర్లే బెస్ట్” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

18:1 ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తి

ప్రభుత్వ బడుల్లో ప్రతి 18 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉన్నారని, ప్రైవేట్ పాఠశాలల్లో ఇది 25 మందికి ఒకరే అని గణాంకాలు చూపిస్తున్నాయని సీఎం వివరించారు. “గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానించింది… మద్యం దుకాణాల వద్ద డ్యూటీలు పెట్టింది. మా ప్రభుత్వం ఉపాధ్యాయులను గౌరవిస్తోంది. పారదర్శకంగా బదిలీలు చేశాం, మెగా డీఎస్సీ ద్వారా భారీగా నియామకాలు చేపట్టాం” అని చెప్పారు.

‘కలలకు రెక్కలు’ – విదేశీ విద్యకు పావలా వడ్డీ రుణం

విదేశీ విద్య కోసం ఆర్థిక ఇబ్బందులు విద్యార్థులకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో కొత్తగా ‘కలలకు రెక్కలు’ పథకం ప్రవేశపెడుతున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ పథకం కింద విదేశాల్లో చదువు కోసం అయ్యే మొత్తాన్ని పావలా వడ్డీకే రుణంగా అందిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర విద్యా రంగాన్ని వచ్చే మూడేళ్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే దిశగా మంత్రి నారా లోకేశ్ పనిచేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు.

విద్యార్థుల ప్రతిభకు కొత్త వేదిక – ఇన్నోవేటర్స్ సమ్మిట్

విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వచ్చే జనవరిలో స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్టనర్‌షిప్ సమ్మిట్ నిర్వహించనున్నట్టు సీఎం వెల్లడించారు. 7వ తరగతి నుంచే విద్యార్థులను వినూత్న ఆలోచనలకు ప్రోత్సహిస్తామని, జిల్లా–రాష్ట్రస్థాయి ఎంపికల ద్వారా మెరుగైన విద్యార్థులను పారిశ్రామికవేత్తలతో కలిపే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

భామిని మోడల్‌ స్కూల్‌లోని ల్యాబ్స్‌ను పరిశీలిస్తూ… ‘క్లిక్కర్ టూల్’ ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేసే విధానాన్ని సీఎం అభినందించారు. ‘స్కై, మౌంటెన్, స్టీమ్’ పద్ధతిలో విద్యార్థులను వర్గీకరించి బోధించడం ఫలితాలిస్తున్నదని వ్యాఖ్యానించారు.

విలువలతో కూడిన విద్య – సంపూర్ణ వికాసం లక్ష్యం

విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు అన్నారు. దీనిలో భాగంగా చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు, ‘డొక్కా సీతమ్మ’ మధ్యాహ్న భోజన పథకం, రాజకీయరంగులు లేని స్టూడెంట్ కిట్లు అందిస్తున్నట్టు తెలిపారు.

నో బ్యాగ్ డే’ వంటి కార్యక్రమాలతో పిల్లలు ఆనందంగా చదువుకునే వాతావరణం ఏర్పడుతోందని వివరించారు.

కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీఎం, మంత్రి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.