అమితాబ్ బచ్చన్

‘పుష్ప 2: ది రూల్’తో బాక్సాఫీస్‌కు వైల్డ్ ఫైర్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు కథానాయకుడు అల్లు అర్జున్. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.829కోట్ల వసూళ్లు సాధించి అతి తక్కువ రోజుల్లో ఈ స్థాయి వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. అయితే బన్నీ ఇప్పుడు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ ప్రశంసలు దక్కించుకున్నారు. ఇటీవల ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అల్లు అర్జున్ ముంబయిలో ఓ మీడియాతో మాట్లాడుతూ.. అమితాబ్ బచ్చన్‌పై (Amitabh Bachchan) ప్రశంసలు కురిపించారు. చిన్నప్పటి నుంచి అమితాబ్ సినిమాలు చూస్తూ పెరిగానని.. ఆయన ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతున్నారని.. ఆయనే తనకు ఆదర్శమని.. బిగ్‌బీ స్ఫూర్తితో చిత్రసీమలోకి ఎంతో మంది హీరోలొచ్చారని.. ఇండియన్ సినిమాకి ఆయనే రియల్ ఐకాన్ అంటూ తన అభిమానాన్ని బయటపెట్టారు అల్లు అర్జున్ (Allu Arjun). తాజాగా ఈ వీడియోను అమితాబ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘‘కృతజ్ఞతలు అల్లు అర్జున్. మీరు నన్ను అర్హతను మించి పొగిడేశారు. మీ కష్టానికి, ప్రతిభకు నేను పెద్ద అభిమానిని. మీరు ఇలాగే మరెన్నో విజయాలు అందుకోవాలి. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలి’’ అంటూ తన పోస్ట్‌లో ఆకాంక్షించారు బచ్చన్. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ.. ‘‘మీరు మా సూపర్ హీరో. మీ నుంచి ఇలాంటి ప్రశంసలు నమ్మలేకపోతున్నా. నాపై మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు’’ అని బదులిచ్చారు (Amitabh Bachchan praises Allu Arjun). ప్రస్తుతం వీళ్లిద్దరి ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.