సిబ్బంది కొరతతో సతమతం అవుతున్న ఇండిగో..

Facebook
X
LinkedIn

గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే వందలాది విమానాల రద్దు

న్యూ డిల్లీ :

దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో  సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్నది. సిబ్బంది కొరతతో సతమతం అవుతున్న ఇండిగో.. నవంబర్‌లో ఏకంగా 1,232 సర్వీసులను రద్దు చేసినట్లు డీజీసీఏ బుధవారం ప్రకటించింది. అంతేకాదు, కేవలం గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే వందలాది విమానాలను   సంస్థ రద్దు చేసింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ సహా ఇతర పట్టణాలకు విమాన సర్వీసులు   నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో సంక్షోభం తలెత్తింది.సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, ఎయిర్‌పోర్టులలో రద్దీ వంటి కారణాలు విమానాల రద్దుకు దారితీస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే ఏకంగా 250 నుంచి 300 విమానాలను సంస్థ రద్దు చేసింది. ఈ కారణంగా ప్రధాన విమానాశ్రయాల్లో సంక్షోభం ఏర్పడింది. ఫ్లైట్స్‌ రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు. ఎయిర్‌పోర్ట్స్‌ వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. విమానాలు రద్దు కావడంతో ప్రముఖ ఎయిర్‌లైన్‌ సంస్థ ఇండిగో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు   కోరింది.అదే సమయంలో తాజా పరిస్థితిపై ప్రయాణికులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో విమానాశ్రయాలలో ప్రయాణికులు ఆగ్రహంతో సిబ్బందిని నిలదీస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడును ట్యాగ్‌ చేస్తూ పలువురు నెటిజన్లు ఎక్స్‌ వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 7 గంటలకు పైగా చిక్కుకుపోయిన ఓ ప్రయాణికుడు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తీవ్ర గందరగోళం తలెత్తినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు 12 గంటలకు పైగా ఎటువంటి కన్ఫర్మేషన్‌ లేకుండా పడిగాపులు పడుతున్నారని, ఇండిగో సిబ్బంది అబద్ధాలు చెబుతూ జలగల్లా పీడిస్తున్నారని విమర్శించారు.

48 గంటల్లో సాధారణ స్థితికి..

మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై ఇండిగో సంస్థ స్పందించింది. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. క్రమంగా తమ విమానాలు పునరుద్ధరించనున్నామని వెల్లడించింది. విమానాల రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. 48 గంటల్లో తమ కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని తెలిపింది. ఈ మేరకు గురువారం ఉదయం ప్రకటన విడుదల చేసింది.

ఇండిగో విమానాల రద్దుపై దర్యాప్తు: డీజీసీఏ

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ పనితీరును డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) బుధవారం ప్రశ్నించింది. నవంబర్‌లో 1,232 విమానాలు రద్దవడంతోపాటు విమానాల రాకపోకల సమయాల్లో జాప్యం జరిగింది. ఈ పరిస్థితిపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు చేపట్టవలసిన చర్యల గురించి ఇండిగోతో కలిసి మదింపు చేస్తున్నట్లు తెలిపింది.