26న రైతు, కార్మిక, కూలీల నిరసన, ప్రదర్శనకళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు

Facebook
X
LinkedIn

విజయవాడ:

దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, చేతివృత్తుల సంఘాలు, ప్రజాసంఘాలు 26న నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చాయి. రైతు ఉద్యమం సాగి ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాయి. రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం అని కూడా పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టాయి. దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని, అనంతరం జిల్లా కలెక్టర్లకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం విజయవాడ నగరంలోని దాసరి భవన్లో ఎన్టీఆర్ జిల్లా రైతు, కార్మిక, ప్రజా సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. సమావేశం నగరంలోని తుమ్మలపల్లె కళాక్షేత్రం నుంచి ఏలూరు రోడ్డు మీదగా లెనిన్ సెంటర్ కు ప్రదర్శన నిర్వహించాలని, అనంతరం లెనిన్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాస్థాయిలోని అన్ని ప్రజా సంఘాలు జన సమీకరణ చేసి పాల్గొనాలని కోరారు. లేబర్ కోడ్ల్ రద్దు, 10 గంటల పని గంటల పెంపు, అన్ని రకాల పంటలకు మద్దతు ధర, ఉపాధి హామీ పథకం అమలు, ధరల నియంత్రణ, నిరుద్యోగం, తదితర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నిరసన ప్రదర్శన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి మూలీ సాంబశివరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడి యల్లమందారావు, ఎల్లా రైతు సంఘం నాయకులు పి ఆంజనేయులు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ సి హెచ్ శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం ఉన్న జిల్లా నాయకులు కళ్యాణ్ రావు, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. రామకృష్ణ, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, ఏఐసిటియు జిల్లా నాయకుల లక్ష్మీనారాయణ, కిసాన్ సంఘటన్ జిల్లా నాయకులు కొప్పుల విజయబాబు, ఎఐటియుసి నగర అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.