రాజధానిలో భారీ పేలుడు

Facebook
X
LinkedIn

ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు — 10 మంది దుర్మరణం, 24 మందికి గాయాలు

మోదీ, అమిత్ షా ఆరా — హోంశాఖ కదలికలు వేగం

న్యూఢిల్లీ:

దేశ రాజధానిని రణరంగంగా మార్చిన ఘోర పేలుడు..!
ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న కారు బాంబు పేలుడుతో ఢిల్లీ ఒక్కసారిగా కుదేలైంది.
పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వరకూ మార్మోగింది.

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిచిన కారు — క్షణాల్లో మంటల మయం
సాయంత్రం 6:52 గంటలకు ఎర్రకోట సిగ్నల్ వద్ద ఓ కారు ఆగింది.
రెడ్ లైట్ పడటంతో ఆగిన ఆ కారు క్షణాల్లో భగ్గుమంది.
భారీ శబ్దంతో పేలిపోయి దాని చుట్టూ ఉన్న వాహనాలను మింగేసింది.

మృతదేహాలు ఛిద్రము — ముగ్గురి పరిస్థితి విషమం
ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 24 మందికి గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమమని వైద్యులు చెబుతున్నారు.
లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆసుపత్రి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

“రోడ్డుపై చేయి రక్తపు మడుగులో పడి ఉంది.. షాక్ అయ్యాం!” — ప్రత్యక్ష సాక్షి
ఘటనను కన్నార్పకుండా చూసిన ప్రత్యక్ష సాక్షులు భయంతో వణికిపోయారు.
“రోడ్డుపై ఒకరి చేయి రక్తపు మడుగులో కనిపించింది. మాటల్లో చెప్పలేము…” అని ఒకరు వర్ణించారు.

ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ రంగంలోకి — ఫోరెన్సిక్ బృందాలు ఆధారాల సేకరణలో తలమునక
పేలుడు జరిగిన ప్రాంతానికి ఎన్ఎస్‌జీ, ఎన్ఐఏ, ఫోరెన్సిక్ నిపుణులు చేరుకున్నారు.
ఘటనా స్థలాన్ని పూర్తిగా సీజ్ చేసి ఆధారాలు సేకరిస్తున్నారు.

మోదీ, అమిత్ షా ఆరా — హోంశాఖ కదలికలు వేగం
పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే స్పందించారు.
అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో నేరుగా మాట్లాడారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో నిరంతరం సమాచారం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ కూడా అమిత్ షాతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

“ఇప్పుడే ఏం చెప్పినా తొందరపాటు అవుతుంది” — సీఆర్పీఎఫ్ డీఐజీ
ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, స్పష్టమైన సమాచారం లభించిన తర్వాతే వెల్లడిస్తామని సీఆర్పీఎఫ్ డీఐజీ కిశోర్ ప్రసాద్ తెలిపారు.

పహల్గామ్ దాడి మరువక ముందే.. ఢిల్లీలో మరో విషాదం!
దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అలర్ట్‌లోకి వెళ్లాయి.
ఘటన వెనుక ఉగ్రవాద కోణం ఉందా? లేక సాంకేతిక లోపమా? అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది.