ఢిల్లీలో ఎర్రకోట మెట్రో వద్ద భారీ పేలుడు!ఎనిమిది మంది మృతి – పలు కార్లు దగ్ధం – నగరంలో హైఅలర్ట్‌

Facebook
X
LinkedIn

న్యూఢిల్లీ:

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ సమీపంలోని గేట్‌ నంబర్–1 వద్ద పార్కింగ్‌ చేసిన ఒక కారులో ఈ పేలుడు చోటుచేసుకుంది. వెంటనే మంటలు చెలరేగి పక్కనే ఉన్న పలు వాహనాలను ఆవహించాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

పేలుడుతో మొత్తం ఎనిమిది కార్లు ధ్వంసమయ్యాయి. సాయంత్రం సుమారు 6.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఘటనా స్థలానికి ఢిల్లీ స్పెషల్ సెల్, ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ బృందాలు చేరుకుని పేలుడు కారణాలను పరిశీలిస్తున్నాయి. ఇది ఉగ్రవాద చర్యా? లేక ప్రమాదవశాత్తు జరిగినదా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. మారుతీ ఎకో కారులో పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను రిమోట్ కంట్రోల్‌తో పేల్చివేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఢిల్లీలో హైఅలర్ట్‌

ఈ ఘటన తరువాత ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఎర్రకోట పరిసరాలు, పర్యాటక ప్రాంతాలు, మెట్రో స్టేషన్లలో పోలీసులు క్రమబద్ధంగా తనిఖీలు ప్రారంభించారు. పేలుడు జరిగిన సమయానికి మార్కెట్లు, పర్యాటక ప్రదేశాలు మూసివేసి ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గిందని అధికారులు తెలిపారు.

స్థానికులు చెబుతూ – “పేలుడు శబ్దం దూరం వరకు వినిపించింది. నల్లపొగ ఆకాశాన్నంటింది” అన్నారు. నగరంలో భయాందోళన వాతావరణం నెలకొంది.