సైబ‌ర్ నేరాల ప‌ట్ల అత్యున్న‌త న్యాయ‌స్థానం క‌ఠిన శిక్ష‌లు

Facebook
X
LinkedIn

డిజిట‌ల్ అరెస్టు కేసుల్లో క‌ఠిన శిక్ష‌లు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ :

డిజిట‌ల్ అరెస్టు కేసుల్లో క‌ఠిన శిక్ష‌లు విధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సుప్రీంకోర్టు  అభిప్రాయ‌ప‌డింది. చాలా విస్తృత స్థాయిలో జ‌రుగుతున్న సైబ‌ర్ నేరాల ప‌ట్ల అత్యున్న‌త న్యాయ‌స్థానం షాక్ వ్య‌క్తం చేసింది. డిజిట‌ల్ అరెస్టు కేసుల్లో బాధితులు సుమారు 3000 కోట్లు కోల్పోవ‌డం ప‌ట్ల కోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతున్న మోస‌గాళ్లు త‌మ‌కు తాము భ‌ద్ర‌తా సిబ్బందిగా, కోర్టు అధికారులుగా, ప్ర‌భుత్వాధికారులు ప‌రిచ‌యం చేసుకుని బెదిరింపులకు పాల్ప‌డుతున్నారు. ఆడియో, వీడియో కాల్స్‌తో బాధితుల‌ను పీడిస్తున్నారు. బాధితుల‌ను కాల్స్‌తో బందీలుగా చేసి .. డ‌బ్బులు చెల్లించేలా వ‌త్తిడి తెస్తున్నారు. చీఫ్ జ‌స్టిస్ సూర్య కాంత్‌, ఉజ్వ‌ల్ భుయాన్‌, జోయ్‌మాలా బాగ్చిల‌తో కూడిన ధ‌ర్మాసనం డిజిట‌ల్ అరెస్టు కేసుల‌పై విచార‌ణ చేప‌ట్టింది. ఈ విష‌యంలో కోర్టుకు సూచ‌న‌లు చేసేందుకు అమిక‌స్ క్యూరీని నియ‌మించారు. కేంద్ర హోంశాఖ‌, సీబీఐ స‌మ‌ర్పించిన రెండు నివేదిక‌ల‌ను కోర్టు ప‌రిశీలించింది.డిజిట‌ల్ అరెస్టుతో బాధితుల నుంచి సైబ‌ర్ నేర‌గాళ్లు సుమారు మూడు వేల కోట్లు వ‌సూల్ చేయ‌డం షాకింగ్‌గా ఉంద‌ని, బాధితుల్లో సీనియ‌ర్ సిటిజ‌న్లు ఉన్నార‌ని, ఒక‌వేళ ఇలాంటి కేసుల్లో క‌ఠిన‌మైన ఆదేశాలు ఇవ్వ‌కుంటే, ఈ స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా త‌యారు అవుతుంద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది. జుడిషియ‌ల్ ఆదేశాల‌తో భ‌ద్ర‌తా ఏజెన్సీలను బ‌లోపేతం చేయాల‌ని, ఇలాంటి కేసుల‌పై ఉక్కుపాదం మోపాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. డిజిట‌ల్ అరెస్టుల కేసుల‌పై న‌వంబ‌ర్ 10వ తేదీ మ‌ళ్లీ విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. అమిక‌స్ క్యూరీ ఇచ్చే సూచ‌న‌ల ఆధారంగా కొన్ని ఆదేశాలు ఇవ్వ‌నున్న‌ట్లు కోరింది.సిండికేట్ నేర‌గాళ్లు ఆఫ్‌షోర్ లొకేష‌న్ల నుంచి ఇలాంటి నేరాల‌కు పాల్ప‌డుతున్నార‌ని సీబీఐ త‌న రిపోర్టులో చెప్పిన‌ట్లు జ‌స్టిస్ కాంత్ పేర్కొన్నారు. కేంద్రం, సీబీఐ త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వాదించారు. కేంద్ర హోంశాఖ‌కు చెందిన సైబ‌ర్ డివిజ‌న్ ఇలాంటి కేసుల్ని డీల్ చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. హ‌ర్యానాకు చెందిన ఓ మ‌హిళ సీజేఐ బీఆర్ గ‌వాయ్‌కి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును వాదిస్తున్నారు. త‌ప్పుడు కోర్టు ఆదేశాల‌ను చూపిస్తూ నేర‌గాళ్లు ఫ్రాడ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆమె ఆరోపించింది. ఆ వృద్ధ మ‌హిళ నుంచి నేర‌గాళ్లు కోటికిపైగా లూటీ చేశారు. సీబీఐ, ఈడీ, జుడిషియ‌ల్ అధికారులమ‌ని చెప్పి ఆడియో, వీడియో కాల్స్‌తో బెదిరించార‌ని ఆమె పేర్కొన్న‌ది. అంబాలాలో ఈ ఘ‌ట‌న‌పై రెండు కేసులు న‌మోదు అయ్యాయి.