అమెజాన్‌లో 14 వేల మందిని తొలగించనున్నట్లు అధికారిక ప్రకటన

Facebook
X
LinkedIn

న్యూఢిల్లీ:

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మళ్లీ భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా 14 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. భారత్‌లోనూ 800 నుంచి 1,000 మందికి ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

విభాగాల వారీగా తొలగింపులు
మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, మానవ వనరులు, టెక్‌ విభాగాల్లో ఈ తొలగింపులు జరగనున్నట్లు తెలిసింది. సంస్థ సీఈవో ఆండీ జాస్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత లేఆఫ్‌ల సంఖ్య పెరిగిందని తెలిసింది. జనరేటివ్‌ ఏఐ విస్తరణ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో కార్పొరేట్ సిబ్బంది సంఖ్య తగ్గే అవకాశముందని ఆయన ఇప్పటికే పేర్కొన్నారు.

ఇప్పటికే వేల మందికి షాక్‌
2023లో అమెజాన్‌ రెండు దఫాల్లో 27 వేల మందిని తొలగించింది. ఆ సమయంలో భారత్‌లో 500 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థ, వ్యయ నియంత్రణలో భాగంగా మళ్లీ లేఆఫ్‌ల దిశగా అడుగులు వేస్తోంది.

మూడు నెలల గడువు
తొలగింపుకు గురయ్యే ఉద్యోగులకు కంపెనీలోనే కొత్త అవకాశాలు వెతికే అవకాశం ఇవ్వనున్నట్లు అమెజాన్‌ తెలిపింది. ఇందుకోసం మూడు నెలల గడువు ఇస్తామని, ఆసక్తి లేని వారికి సెవరెన్స్‌ పే, అవుట్‌ ప్లేస్‌మెంట్‌ సపోర్ట్‌, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించింది.

ఉద్యోగుల మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ, కంపెనీ ఏఐ ఆధారిత భవిష్యత్‌ వ్యూహాలను బలపర్చడంపై దృష్టి సారించినట్లు విశ్లేషకులు అంటున్నారు.