ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు

Facebook
X
LinkedIn

రాయ్‌పూర్‌ :
దేశంలో మావోయిజం అంతం అవుతోందన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల నాటికే ఛత్తీస్‌గఢ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంకేర్‌ జిల్లాలోని అంతాగఢ్‌లో ఆదివారం 21 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో నలుగురు డివిజన్ వైస్ కమిటీ సభ్యులు (డీవీసీఎం), తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు (ఏసీఎం), ఎనిమిది మంది పార్టీ సభ్యులు ఉన్నారు. వీరిలో 13 మంది మహిళలు ఉండటం ప్రత్యేకత.

లొంగిపోయిన వారిలో కేశ్‌కల్‌ డివిజన్‌ కార్యదర్శి ముఖేష్‌ కూడా ఉన్నారు. వీరు ఏళ్లుగా అంతాగఢ్‌ పరిసర ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడుతూ క్రియాశీలంగా ఉన్నారు. ఆదివారం ఉదయం బర్రెబెడ గ్రామం వద్ద పోలీసులు వీరిని స్వీకరించారు.

వీరంతా తమ వెంట తీసుకొచ్చిన ఏకే–47 రైఫిళ్లు మూడు, ఎస్ఎల్‌ఆర్‌లు నాలుగు, ఇన్సాస్‌ రైఫిళ్లు రెండు, .303 రైఫిళ్లు ఆరు సహా మొత్తం 18 అత్యాధునిక ఆయుధాలను అప్పగించారు. వీటి బ్లాక్ మార్కెట్ విలువ రూ.10 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. గడచిన రోజు కమ్టేడా క్యాంపులో 50 మంది నక్సలైట్లు లొంగిపోవడం గమనార్హం.

‘పూనా మర్ఘం’తో మారుతున్న బస్తర్‌
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పూనా మర్ఘం – పునరుజ్జీవనానికి పునరావాసం’ కార్యక్రమం ఫలితాలు ఇస్తోందని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌ పేర్కొన్నారు. ‘బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టుల ప్రజా వ్యతిరేక సిద్ధాంతం కూలిపోతోంది. యువత తుపాకులు విడిచి అభివృద్ధి వైపు అడుగేస్తున్నారు’ అని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.