అమ్మాయిల జోలికి వస్తే  తాట తీస్తాం..

Facebook
X
LinkedIn

   ఉక్కుపాదంతో అణచివేస్తాం.. తుని ఘటనపై మంత్రి లోకేశ్..

అమరావతి :

కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాలలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం ఘటనపై మంత్రి నారా లోకేశ్   స్పందించారు. తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలుసుకొని షాక్‌కు గురయ్యానని తెలిపారు. సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని వెల్లడించారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి లోకేశ్ హెచ్చరించారు.బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి, అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినిలకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి మంత్రి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు.కాగా.. తుని గురుకుల పాఠశాల విద్యార్థినిపై నారాయణ అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. స్కూల్‌ నుంచి బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన కామాంధుడు.. ఓ నిర్మానుష్య ప్రాంతంలో మైనర్‌పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి నిలదీయగా నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు నారాయణను అదుపులోకి తీసుకున్నారు. తుని ఘటనపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు స్పందిస్తూ.. నారాయణరావుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కిడ్నాప్, అత్యాచారం కిందకు వచ్చే వివిధ కఠిన సెక్షన్లు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని.. సాయంత్రానికి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఏ పార్టీలకు సంబంధం లేదని.. సోషల్ మీడియాలో పార్టీల మధ్య గొడవలు సృష్టించేందుకు వీడియోలు వైరల్ చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.