కుప్పలు కుప్పలుగా కరెన్సీ కట్టలు కిలోల కొద్దీ నగలు

Facebook
X
LinkedIn

పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఇంజినీర్‌ సంపద చూసి షాకయిన  అధికారులు

భోపాల్‌ :

పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఇంజినీర్‌ సంపద చూసి అధికారులు షాకయ్యారు. లోకాయుక్త అధికారులు   ఆయన ఇళ్లల్లో సోదాలకు వెళ్లగా.. కుప్పలు కుప్పలుగా కరెన్సీ కట్టలు   కిలోల కొద్దీ నగలు బయటపడ్డాయి. ఆయన ఫామ్‌హౌస్‌లో దొరికిన 17 టన్నుల తేనె   ను చూసి అధికారులు అవాక్కయ్యారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ప్రజాపనుల విభాగంలో చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్‌ అయిన జీపీ మెహ్రా లగ్జరీ లైఫ్‌స్టైల్‌ ఇది.ఓ అప్రకటిత ఆస్తుల వ్యవహారంలో తీగ లాగితే మెహ్రా బండారం బయటపడిందని ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు చేస్తుండగా జీపీ మెహ్రా పేరు వినిపించింది. దాంతో అధికారులు ఆయనపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే భోపాల్‌, నర్మదాపురంలోని మెహ్రా నివాసాల్లో లోకాయుక్త అధికారులు తనిఖీలు చేపట్టారు. నలుగురు డీఎస్పీ ర్యాంక్‌ అధికారుల నేతృత్వంలో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి.మణిపురంలోని మెహ్రా నివాసంలో అధికారులు 8.79 లక్షల నగదు, రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలు, రూ.56 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను గుర్తించారు. ఇక దనాపానీలో మెహ్రాకు ఓ లగ్జరీ అపార్టుమెంట్ ఉంది. అందులో అధికారులు తనిఖీలు చేయగా.. భారీగా నోట్ల కట్టలు, రూ.3 కోట్ల విలువచేసే రూ.2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండిని గుర్తించినట్లు సదరు కథనం పేర్కొంది. నర్మదాపురంలో మెహ్రాకు చెందిన ఫామ్‌హౌస్‌కు వెళ్లగా కళ్లుచెదిరే ఆయన విలాసాలు చూసి అధికారులు కంగుతిన్నారు.ప్రైవేటు సామ్రాజ్యాన్ని తలపించేలా ఆ వ్యవసాయ క్షేత్రంలో 32 అధునాతన కాటేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో ఏడు కాటేజీలను పూర్తిచేశారు. మధ్యలో చెరువు, గోశాల, ఆలయం, నాలుగు లగ్జరీ కార్లు కన్పించాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే.. ఆయన ఫామ్‌హౌస్‌ నుంచి ఏకంగా 17 టన్నుల తేనెను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా ఆయన తేనె సాగు చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.మెహ్రా ఆస్తులపై దర్యాప్తు చేపట్టామని, ఆయన ఆస్తుల లెక్కింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఆయన సంపద రూ.వందల కోట్లలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆయన బ్యాంకు రికార్డులు, డిజిటల్‌ ఫైళ్లను ఫోరెన్సిక్‌ బృందాలు తనిఖీ చేస్తున్నాయని చెప్పారు. మెహ్రా బినామీ పెట్టుబడులపైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.