Nagababu : నాగబాబుకు మంత్రి పదవి..శాఖపై ఉత్కంఠ !

Facebook
X
LinkedIn

దిశ, వెబ్ డెస్క్ : నటుడు, నిర్మాత, జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు (Nagababu)కు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కనుంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. అయితే నాగబాబుకు ఏ శాఖ(ministerial post)ను కేటాయిస్తారన్నదానిపై కూటమి పార్టీ్ల్లో..సినీ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది. ఏపీ కేబినెట్‌లో ప్రస్తుతం 24 మంది మంత్రులుండగా…జనసేన నుంచి మంత్రివర్గంలో ప్రస్తుతం పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ ఉన్నారు. ఏపీ అసెంబ్లీ స్థానాల ప్రకారం 25 మందిని మంత్రి వర్గంలోకి తీసుకునే వీలుంది. మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవిని తాజాగా నాగబాబుతో భర్తీ చేయాలని నిర్ణయించారు.

జనసేన చీఫ్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి మేరకు నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించిన నేపథ్యంలో నాగబాబును జనసేన నుంచి రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగింది. కూటమి తరఫున రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా నాగబాబు పేరు లేకుండా విడుదల చేసిన ప్రకటనతోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు స్పష్టమైంది. నాగబాబును రాజ్యసభకు పంపించడం లేనందునా రాష్ట్రంలో మంత్రి పదవి ఖాయమని తేలిపోయింది. ఇక నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్న చంద్రబాబు ఆయనకు ఏ శాఖ ఇస్తారన్నదానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

మెగా బ్రదర్స్ అరుదైన రికార్డు

సినిమాలలో రాణించి గుర్తింపు పొందిన మెగా బ్రదర్స్ ముగ్గురు అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్ , నాగబాబులు సినీ పరిశ్రమలో తమదైన శైలిలో పనిచేశారు. ఇక రాజకీయాలలో కూడా ముగ్గురు సోదరులు అరుదైన రికార్డును అందుకోబోతున్నారు. మెగా ఫ్యామిలీ నుండి ముగ్గురు అన్నదమ్ములు కూడా మంత్రులుగా చరిత్ర సృష్టించబోతున్నారు. చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేయగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా రాజకీయాలలో తన ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సాధిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా చంద్రబాబు క్యాబినెట్ లోకి చేరనున్నారు. దీంతో మెగా కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు కూడా మంత్రులుగా చట్టసభల్లో పనిచేసిన రికార్డును సొంతం చేసుకోనున్నారు.