విజయవాడ :
ఏపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం YCPపై కోపాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల మీద చూపిస్తుందని ఆరోపించారు. ఆమె ఇవాళ(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. అసలు YCPకి YSRకి ఏం సంబంధం అని నిలదీశారు.మహానేత YSR పేరు పెట్టినంత మాత్రాన ఏమైనా ఆయన వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా అని షర్మిలా ప్రశ్నించారు. YSR ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడని కీర్తించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర అని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఈ దేశానికి దిశా నిర్దేశం YSR అని పేర్కొన్నారు. ప్రజాక్షేమమే పరమావధిగా చివరి దాకా పరితపించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకొచ్చారు.ఇంతటి ప్రజాభిమానం కలిగిన గొప్పనాయకుడిని నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా.. అని షర్మిలా మండిపడ్డారు.ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. నందిగామ గాంధీ సెంటర్‌లో మహానేత YSR విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో మహానేత YSR మరణం తర్వాత నాటి ప్రభుత్వం అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని షర్మిలా గుర్తు చేశారు. YSR విగ్రహం చుట్టూ YCP అక్రమంగా వేసుకున్న సెట్టింగులు తొలగించుకోమని సూచించారు. కానీ ఇదే సాకుగా చూపి YSR విగ్రహాల మీద చేయివేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. YCPకి YSR విగ్రహాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తొలగించిన చోట వెంటనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని.. కూటమి ప్రభుత్వాన్ని షర్మిలా డిమాండ్ చేశారు.