అమరావతి :
గోవా గవర్నర్‌గా నియమితులైన టీడీపీ సీనియర్ నేత , కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు . ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపక సభ్యుల్లో ఒకరైన పూసపాటి అశోక్ గజపతిరాజు తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పంపించారు. టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరోకు కూడా రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పార్టీతో పాటు ప్రజలు, దేశానికి సేవ చేసేందుకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ లేఖ కాపీని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని లేఖల్లో అధిష్టానాన్ని కోరారు.ఇటీవల దేశంలో మూడు రాష్ట్రాలకు ముగ్గురు గవర్నర్ల నియామకంలో అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా కేంద్రం నియమించింది. ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉండడంతో శుక్రవారం తన రాజీనామాను అధికారికంగా సమర్పించారు. 43 ఏళ్ల పాటు టీడీపీలోనే కొనసాగిన ఆయన 2004లో మినహా వరుసగా విజయనగరం ఎమ్మెల్యే, ఎంపీగా గెలుస్తూ వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా కొనసాగారు.